పంటల సాగుకు రూ.2లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ భేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు బూటకమేనని తేటతెల్లమవుతున్నది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘ఏరు దాటాక బోడి మల్లయ్య’ అన్న చందాన్ని తలపిస్తున్నది. రుణమాఫీని లబ్ధిదారుల సంఖ్యను, వారి కోసం వెచ్చించాల్సిన డబ్బును ఎంత వీలైతే అంతగా కుదించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తూ రుణమాఫీని అమలు చేశారు.
లక్షలాది అర్హులైన రైతులకు మొండిచెయ్యి చూపుతూ మ.మ. అనిపించేశారు. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కనీసం రెండు లక్షల మంది రుణమాఫీ లబ్ధి నుంచి చేకూరనట్లు రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. రైతు ప్రభుత్వమంటూ రైతులకు టోకరా పెట్టేందుకే కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం చివరి విడుత రుణమాఫీలో రెండు లక్షల వరకు అమలు చేస్తున్నట్లు ప్రకటించినా రైతుల వారీగా పూర్తి వివరాలు వెల్లడించ లేదు. సహకార సంఘాల లబ్ధిదారుల జాబితాలపైనా శుక్రవారం రాత్రి వరకు స్పష్టత రాలేదు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వం చెప్పిన విధంగా పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ అమలు చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐదు లక్షల మంది రైతుల వరకు లబ్ధిదారులుగా ఉంటారని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతూ రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల దాదాపు రెండు లక్షల మంది రుణమాఫీకి దూరమయ్యారని స్పష్టమవుతున్నది. గతేడాది ఆగస్టులో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీ లెక్కలే ఇందుకు సాక్ష్యంగా తెరపైకి వస్తున్నాయి. 2018 ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీలో రూ.99,999వరకు అమలైంది. అప్పట్లో పాస్పుస్తకమే ప్రమాణికంగా రుణమాఫీ అమలు చేశారు. దాంతో భారీ మొత్తంలో రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరింది.
కేసీఆర్ సర్కార్ హయాంలో లక్షకు ఒక్క రూపాయి తక్కువగా అంటే 99,999 వరకు రుణమాఫీని అమలు చేస్తేనే ఉమ్మడి జిల్లాలో 4,00,518 మంది రైతులకు మొత్తం రూ.2,159.77 కోట్ల రుణమాఫీ జరిగింది. కానీ ప్రస్తుతం రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేసినా మూడు విడతల్లో కలిపి లబ్ధి జరిగింది సగమే కావడం చర్చనీయాంశమైంది. మూడు విడతల్లో కలిపి 3.39 లక్షల మంది రైతులకే మేలు జరుగుతున్నది.
కేసీఆర్
హయాంలో లక్ష లోపు రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షల రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. అప్పటితో పోలిస్తేనే 60 వేల మంది లబ్ధిదారులు తగ్గిపోయారు. గతంలో కంటే రెట్టింపు రైతులు ఉంటారని ప్రారంభంలో అంచనా వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులతో జాబితా సగానికి సగం తగ్గిపోయింది.
ఎన్నికల హామీలో చెప్పిన విధంగా పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తే పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తించేలా కట్టుదిట్టంగా వ్యవహరించింది. రేషన్ కార్డులో ఎంత మంది ఉన్నా ఒక కుటుంబంలో గరిష్టంగా రూ.2లక్షల రుణమాఫీ మించవద్దని ఆదేశాలిచ్చింది. రేషన్‌కార్డు లేని వారిని మొత్తానికే పక్కన పెట్టింది. దీనికి తోడు ఆధార్ సీడింగ్ లేదా ఇతర సాంకేతిక పరమైన సమస్యలు ఉన్న వారికి సైతం రుణమాఫీ కాలేదు. వారందరికీ ఎప్పుడు చేస్తారన్న దానికి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు.
పంద్రాగస్టు సందర్భంగా చివరి విడుత రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది. ఆ జాబితాలు శుక్రవారం సాయంత్రానికి కూడా అడ్రెస్ లేవు. కేవలం జిల్లాల వారీగా రైతుల సంఖ్య, రుణమాఫీ మొత్తం లెక్కలు మాత్రం అధికారికంగా ప్రకటించారు. కానీ బ్యాంకుల వారీగా, సొసైటీల వారీగా రైతుల సంఖ్య, జాబితాలపై స్పష్టత రాలేదు. రైతులు శుక్రవారం తమ పంట రుణాలు ఉన్న బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ
కనిపించారు. తమకు స్పష్టత రాలేదని బ్యాంకర్లు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. సహకార సొసైటీలకు కూడా రైతుల జాబితా చేరలేదు. సోమవారం వరకు స్పష్టత రావచ్చని అధికారులు చెప్తున్నారు.
పదేండ్లకు పైగా కొత్త రేషన్‌కార్డుల జారీ లేకపోవడంతో చాలామంది యువ రైతులకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ సర్కార్ పెట్టిన రేషన్ కార్డు ప్రమాణికం షరతు వల్ల వేలాది మందికి ఇప్పుడు రుణమాఫీ వర్తించడం లేదు. వారంతా ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రేషన్‌కార్డు లేని రైతులను గ్రామాల వారీగా సభలు పెట్టి అర్హులను గుర్తిస్తామని ప్రారంభంలో ప్రభుత్వం చెప్పినా అందుకు సంబంధించి కార్యచరణేదీ చివరి
విడుత అనంతరం కూడా లేదు.
దాంతో రేషన్‌కార్డు లేని రైతులకు రుణమాఫీపై నీలినీడలు అలుముకున్నాయి. సాంకేతికంగా బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ సీడింగ్ వంటి సమస్యలు తలెత్తిన రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. వీరి పరిస్థితి ఏంటన్నది కూడా తేలాల్సి ఉంది. ఇక అన్ని అర్హతలు ఉండి కూడా రుణమాఫీ కాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇలా ఎన్నో సందేహాలు రుణమాఫీ కాని రైతుల్లో నెలకొన్నాయి.