తుంగతుర్తి, అక్టోబరు 12 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దశదిన కర్మలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి మృతి బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. దామోదర్‌రెడ్డి ప్రజా జీవితంలో ఆస్తులన్నింటినీ కరిగించి కార్యకర్తలు, పార్టీ కోసం పని చేశారన్నారు.
ఈ రోజుల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితేనే వందల కోట్ల ఆస్తులు కూడ పెట్టుకుంటున్నారన్నారు. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన దామోదర్‌రెడ్డి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వం వచ్చిన వేలాది ఎకరాల భూములు త్యాగం చేశారని కొనియాడారు. రాజకీయ కక్షలతో కార్యకర్తలపై దాడులు జరిగితే వారికి అండగా నిలబడి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను కాపాడారని అన్నారు.
ఎస్ఆర్ఎస్పీ ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలని దామోదర్‌రెడ్డి కొట్లాడారని తెలిపారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రారంభమయ్యేలా కృషి చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, జిల్లాల్లో జోడెద్దుల్లా రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ జెండాను కాపాడారని, టైగర్ దామన్నగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దామోదర్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారన్నారు. ఆయన కుటుంబానికి భవిష్యత్తులో పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు, అభిమానులు, సూచనల ప్రకారం ఎస్సార్ఎస్పీ స్టేజ్ 2కి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెడతున్నట్లు ప్రకటించారు. దీనిపై 24 గంటల్లో జీవో ఇస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో దామోదర్‌రెడ్డి అండగా నిలిచి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడారని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో దామోదర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారని, ఆయన జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, రాగమయి, డిప్యూటీ స్వీకర్ రామచందర్ నాయక్, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.