నేరేడుచర్ల, ఏప్రిల్ 11 : రేవంత్ రెడ్డి రాష్ట్రానికి యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణలో పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి వ్యవహార శైలి ఇందుకు నిదర్శనగా ఉందన్నారు. శుక్రవారం నేరేడుచర్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నరహంతక పాలనలో బషీర్బాగ్ కాల్పుల ఉదంతం, అనంతరం కేసీఆర్ ఎంతో మేధోమదనం చేసి తన సర్వాధికారాలు వదులుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 21 ఏప్రిల్ 2001న బీఆర్ఎస్ పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను, మేధావులను, విద్యార్థులను ఒకేతాటి పైకి తీసుకువచ్చి ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ చేసిన పోరాటాలే ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి ఉద్యమ నేతతో మీకు పోలికా అని కాంగ్రెస్, బీజేపీ నేతలను విమర్శించారు.
ఎత్తు పల్లాలు, పడి లేవడాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సాధించుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు స్వర్ణ యుగంగా పాలన కొనసాగిందన్నారు. 16 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పిందో, ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 27న వరంగల్ పట్టణంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం కోరుతూ ఈ నెల 14న హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించే సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం ఛలో వరంగల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. అంతకుముందు జ్యోతిబాపూలే పూలే జయంతిని పురస్కరించుకుని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేరేడుచర్ల మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్ బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీలు లకుమల్ల జ్యోతి భిక్షం, చెన్నబోయిన సైదులు , మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, టౌన్ యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేశ్, నాయకులు కొణతం లచ్చిరెడ్డి, ఇనపాల పిచ్చిరెడ్డి, ఇంజమూరి రాములు, పంగ శ్రీను, రాపోలు నవీన్, బొడ్డుపల్లి సుందరయ్య, తాళ్లూరి సాయి, చిట్యాల శ్రీను, పల్లెపంగు నాగరాజు, శ్రీను నాయక్, లకుమల్ల రవీందర్, ఇంజమూరి శ్రీను, ఇంజమూరి రాజేశ్ పాల్గొన్నారు.
BRS : యాక్టింగ్ సీఎంగా రేవంత్.. యాక్టివ్ రూరల్స్గా బాబు, మోదీ : ఒంటెద్దు నర్సింహారెడ్డి