– మీ దుశ్శాసన పాలనకు తెర పడే రోజు దగ్గరలోనే ఉంది
– బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలి
– వెయ్యి మంది మహిళలతో సూర్యాపేటలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ నిరసన
సూర్యాపేట, సెప్టెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దుశ్శాసన పాలన నడుపుతున్నాడని, దానికి తెరపడే రోజు దగ్గరలోనే ఉందని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలపై పోలీసులతో దాడి చేసి గాయపరచడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సుమారు 1000 మంది మహిళలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసులతో దుర్మార్గంగా వ్యవహరించదాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
రేవంత్ రెడ్డి మహిళల పట్ల నీకున్న సంస్కారం ఇదేనా అని, మహిళలను అవమానించడమే ప్రజా పాలన అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి, మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రేవంత్ మహిళల పట్ల నీ సంస్కారం ఇదేనా ?