యాదాద్రి భువనగిరి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పం చ్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్లు తేలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఆయా కా ర్యాలయాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ప్రకటించారు. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను నిర్ణయించారు. జిల్లా లో మొత్తం 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బీసీలకు 105 స్థానాలు, ఎస్సీలకు 74, ఎస్టీలకు 49 సీట్లు రిజర్వ్ అయ్యాయి. 199 గ్రామ పంచాయతీలకు అన్రిజర్వ్డ్గా తేల్చారు. మొత్తం 427 జీపీల్లో 195 పంచాయతీల్లో మహిళలకు కేటాయించారు.
జిల్లా లో 3704 వార్డులు ఉండగా, 969 వార్డుల్లో బీసీలకు, 365 ఎస్టీ, 636 ఎస్సీ, 1734 అన్రిజర్వ్డ్ స్థానాలను తేల్చారు. రిజర్వేషన్లు 50శాతానికి పరిమితం కావడంతో బీసీలు పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయారు. పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. గతేడాది ప్రారంభంలోనే స్థానిక సంస్థలకు సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. అయితే వెంటనే ఎన్నికలు జరుగుతాయని ఆశావహులు ఆశలపల్లకీలో విహరించారు. పోటీలో ఉండాలనుకునే వారంతా ఖర్చుకు వెనకాడలేదు. పండుగలు, పబ్బా లు తదితర కార్యక్రమాలకు భారీగా డబ్బు లు పంపిణీ చేశారు. కానీ తీరా రిజర్వేషన్లకు వచ్చేసరికి అంతా తారుమారైంది. తమకే వస్తుందనుకున్న స్థానంలో రిజర్వేషన్లు మారిపోవడంతో అంతా తలలు పట్టుకుంటున్నారు.

Nalgonda4