చివ్వెంల, జూన్ 10 : పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో దివ్యాంగుల సంక్షేమ శాఖకు నేటికీ మంత్రిని నియమించకపోవడం బాధాకరమన్నారు. దివ్యాంగులను రాజకీయ నాయకులు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్న తీరును దివ్యాంగ సమాజం గమనిస్తుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి దివ్యాంగుల పింఛన్లు రూ.6 వేలు పెంచుతామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో దివ్యాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినట్లు తెలిపారు. కాగా వాటిలో ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగ సమాజంపై వివక్షను విడనాడి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్ పాల్గొన్నారు.