సూర్యాపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట పట్టణంలో ఇటీవల కొద్దికాలంగా వ్యక్తి పూజ మొదలైంది. ఎలాంటి హోదా లేని వ్యక్తిని ఏకంగా జిల్లా అధికారులు మొదలు కింది స్థాయి అధికారుల వరకు కాకా పడుతున్నారు. మరో పక్క ఆ వ్యక్తి ఏ పనికైనా అన్నీ తానేనని, ఎవరి వద్దకు వెళ్లినా తిరిగి మళ్లీ తన వద్దకే రావాలని బెదిరింపులకు పాల్పడుతూ పిలిపించుకుంటున్నారనే ప్రచారం పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో అవినీతి అధికారులు ఎటూ వెళ్లకుండా ఆయన వద్దకే వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు నాయకుడికి ఎలాంటి ప్రొటోకాల్ లేకపోయినా.. అధికారులు ఇచ్చే ప్రాధాన్యత వల్ల ఒకరిని చూసి మరొకరు ఆయన వద్దకే క్యూ కడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు వచ్చిందంటే ఏకంగా ప్రొటోకాల్ ఉన్న వారిని కించపరిచే వరకు వెళ్లడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మే 5వ తేదీ వరకు నిర్వహించేబ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, అలాగే భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించే హనుమజ్జయంతి పంచాహ్నిక ఉత్సవాల పత్రికలు సూర్యాపేటలో చర్చనీయాంశంగా మారాయి.
పట్టణ పరిధిలో జరుగబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేని వ్యక్తి పేరు ముందు పెట్టి ఏకంగా మున్సిపల్ ఛైర్పర్సన్ పేరు వెనక్కు నెట్టి వేయడం పట్ల సొంత పార్టీ నాయకులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అధికార పార్టీలోని గ్రూపు తగాదాలపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. సదరు పార్టీలోని రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి కంటే కూడా ఎలాంటి హోదా లేని ఈ ప్రైవేట్ వ్యక్తి పేరే పైకి రావడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. జనం ఓట్లతో గెలుపొంది చైర్మన్ పీఠం అధిరోహించిన ఆమెను కాదని పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, ఇది ఘోర పరాభవమని పేర్కొంటున్నారు. ఇకనైనా సదరు వ్యక్తులు తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కాలంలో ఏనాడూ ఇలాంటి దిక్కుమాలిన సంఘటనలు చోటు చేసుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఇలాంటివి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? ఎవరు ప్రోత్సహిస్తున్నారు.. అని సదరు పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.