నల్గొండ విద్యా విభాగం, (రామగిరి)మార్చి 13 : అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేసిన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గల క్రీడా మైదానాలను రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు వినియోగించుకోవాలని కోరుతూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కె.హరీశ్‌కుమార్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సోనీ బాలాదేవిని కోరారు.
గురువారం బాలాదేవిని కలిసిన హరీశ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంజీయూలో క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడల నిర్వహణకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులను వివరించారు. అలాగే యూనివర్సిటీ ఆధ్వర్యంలో 4 పర్యాయాలు టీఎస్ పీఈసెట్ విజయవంతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సోనీ బాలాదేవి స్పందిస్తూ త్వరలోనే యూనివర్సిటీని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలు ఇలాంటి క్రీడామైదానాలు అభివృద్ధి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ప్రత్యేక అధికారి, ఖేలో ఇండియా స్కీమ్ ప్రొఫెసర్ సోమలింగం, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఆర్.మురళీ పాల్గొన్నారు.