దామరచర్ల, జూన్ 12 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్లాంట్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజున కూడా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల కొరతను చూపిస్తూ ప్లాంట్ను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి ప్లాంట్ను కేవలం ఉద్యోగుల కొరత సాకుగా చూపించడం సరైనది కాదన్నారు. స్థానికులు కూడా కల్పించుకుని ఇట్టి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి టెండర్ల ప్రక్రియను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ సీఈ కి వినతి పత్రం అందజేశారు.

టెండర్ల ప్రక్రియ రద్దు చేయాలని వైటీపీఎస్ ప్లాంట్ సీఈకి వినతి