సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏడాదిగా నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రూ.187 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. దవాఖాన సిద్ధంగా ఉన్నప్పటికీ, వైద్య పరికరాల ఏర్పాటు, స్పెషాలిటీ వైద్యుల నియామకం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. కార్మికులకు నిలయమైన ఈ ప్రాంతంలో వారికి వైద్యం అందని ద్రాక్షగా మారింది.
పటాన్చెరు టౌన్, ఆగస్టు 13: బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రజలకు, ఈ ప్రాంతంలోని కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రూ.187 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనం పూర్తయి ఏండ్లు గడుస్తున్నది. అవసరమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయకపోవడం, వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో దవాఖాన ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దేశంలోనే మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రాష్ర్టాలకు చెందిన వేలాది మంది కార్మికులు, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయి.
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినా, అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ దవాఖానల్లో భారీ బిల్లులు చెల్లించలేక అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. మరికొందరు సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తేవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. దవాఖానను వెంటనే ప్రారంభించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఇటీవల సంతకాల సేకరణ చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి దవాఖానను తక్షణమే అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం ఉన్న పటాన్చెరు ఏరియా దవాఖానలో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి రోజూ వెయ్యికిపైగా ఓపీ కేసులు నమోదవుతున్నా, దవాఖానలో అవసరమైన వైద్యులు, సిబ్బంది లేరు. ఇటీవల తరుచూ కరెంట్ సమస్య వేధిస్తున్నది. సెల్‌ఫోన్ వెలుతురులో సిబ్బంది చికిత్స చేస్తున్నారు. ఒక్కోసారి గంటల తరబడి కరెంట్ లేకపోవడంతో దవాఖానలో అడ్మిట్ అయిన పేషెంట్లు భయాందోళనలకు గురవుతున్నారు. దవాఖానలో పలు ముఖ్యమైన టెస్ట్‌లు చేయకపోవడంతో రోగులు ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
పటాన్చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి వైద్యులు నియమించాల్సి ఉంది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లాం. కొన్ని వైద్య పరికరాలు సమకూరాయి. మరిన్ని వైద్య పరికరాలు సమకూర్చాలి. గుండె, న్యూరో, కిడ్నీతో పాటు తదితర అవసరమైన ప్రత్యేర వైద్యుల నియామకం జరిగితే దవాఖానను ప్రారంభించవచ్చు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
– డాక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా వైద్య కోఆర్డినేటర్ (సంగారెడ్డి జిల్లా)