నీలగిరి, జనవరి 7: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కొందరు అధికారులు, ఉద్యోగులపై కలెక్టర్ వేసిన కమిటీ నివేదికను అధికారులు మాయం చేశారు. దవాఖానలోని ఇద్దరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ శానిటేషన్, అవుట్ సోర్సింగ్, డైట్, డ్రగ్స్ సర్జికల్, ఇంప్లాంట్స్ బిల్లుల చెల్లింపుల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు పత్రికల్లో పలు కథనాలు వచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన కలెక్టర్ గతేడాది నవంబర్ 15న నలుగురు అధికారులతో కూడిన కమిటీని వేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అదేనెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో విచారణ కమిటీ సభ్యులు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధుల నుంచి సమాచారం సేకరించేందుకు విచారణ చేపట్టి నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక రెండు నెల లు గడుస్తున్నా నేటికీ కలెక్టర్ వద్దకు రాలేదు. పైగా ఏజెన్సీ ప్రతినిధుల నుంచి రాతపూర్వకంగా తీసుకున్న వివరాలను ఉన్నతాధికారులు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నల్లగొండ జనరల్ దవాఖానలో పైసా లేనిదే పని జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి గత నవంబర్ 26లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశానుసారం నలుగురితో కూడిన కమిటీ ఏర్పాటైంది. అయితే దవాఖానలోని ఉన్నతాధికారులు ఆరోపణలు వచ్చిన అధికారుల నుంచి ఎలాంటి వివరణ కానీ, మెమోలు కానీ జారీ చేయలేదు. దవాఖానలో అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా… ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఫైల్‌ను తొకిపెట్టి ముడుపులు అందాక క్లియర్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ముడుపులు ఇస్తేనే జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలోని అడ్మినిస్ట్రేషన్ విభాగం లో ఫైళ్లు కదులుతున్నాయని, గతంలో బిల్లుల చెల్లింపు ఫైళ్లపై సంతకం కోసం ముడుపులు చెల్లించాల్సి వస్తోందని పలువురు ఏజెన్సీ ప్రతినిధులు విచారణ కమిటికీ నివేదిక ఇచ్చారు. దీంతో తమకు ఇబ్బంది వస్తుందని గ్రహించిన ఇద్దరు అవినీతి అధికారులు ఆ నివేదిక తమకు అనుకూలంగా వచ్చేలా పావులు కదిపా రు. అయితే ఏజెన్సీ ప్రతినిధులు తాము వాస్తవాలు చెప్పామంటూ, వారికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందేకు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఏజెన్సీని బ్లాక్‌లో పెడతామని, బిల్లులు రాకుండా అడ్డుకుంటామని, భవిష్యత్‌లో ఎలా టెండర్లు వేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. వీరి అవినీతిపై ఇటీవల రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ సెక్రటరీకి, జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డా.అరుణ కుమారి వివరణ కోసం ప్రయత్నించగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దవాఖానలో జరుగతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరపాలంటూ కలెక్టర్ పలు విభాగాల హెచ్వోడీలు డాక్టర్ వెం కటనాగరాజు, సీహెచ్ శివకుమార్, డా. శ్రీనివాస్,డా.ప్రవీణ్‌కుమార్‌తో కమిటీని నియమించారు. విచారణ చేపట్టి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గత నవంబర్ 15న సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్, అవుట్ సోర్సింగ్, డైట్, డ్రగ్స్ సర్జికల్, ఇంప్లాం ట్స్ బిల్లుల చెల్లింపులో పాల్గొన్న పలువురు ఏజెన్సీ ప్రతినిధుల నుంచి స్టేట్మెంట్ సేకరించారు. ప్రతి ఒక్కరి నుంచి స్టేట్మెంట్తో పాటు రాతపూర్వక వివరాలు తీసుకొని వాటి ఆధారంగా సూపరింటెండెంట్‌కు నవంబర్ 25న నివేదిక సమర్పించారు. కానీ నివేదిక మాత్రం నేటికీ కలెక్టర్ వద్దకు రాలేదు. దవాఖానకు చెందిన ఉన్నతాధికారి నివేదికను బీరువాలో పెట్టి సెలవుల్లో వెళ్లారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తన పరిధిలో జరగలేదన్నారు.