నల్లగొండ, జూన్ 24 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కల్యాణ మండపం వరకు మంత్రి మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జమదగ్ని మహర్షి వారి దివ్య కల్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఆలయ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఈఓ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్ పాల్గొన్నారు.