నల్లగొండ : నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ( Nagarjunasagar Project ) నుంచి నీటిని విడుదల(Water Release) చేయనుంది. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను ఆదుకోనుంది .
ప్రాజెక్టుకు ఎగువభాగం నుంచి 2,67,684 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 6,906 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 180 అడుగులకు గాను ప్రస్తుతం 159.837 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ నీటి నిలువ సామర్ధ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157 టీఎంసీ లనీరు నిలువ ఉంది.
నీటి విడుదలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumarreddy) హాజరు కానున్నారని నల్లగొండ డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం నల్గొండలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడమ కాలువకు నీటి విడుదల ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సేద్యం అవుతాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి గిరి, కూసుకుంట్ల రాజిరెడ్డి, యరమాద మోహన్ రెడ్డి, నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.