కోదాడ, జూన్ 3 : కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని పరారైనన సంఘటన వెలుగు చూసింది. తమ వద్ద నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడం టూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగెల జితేందర్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. జితేందర్‌రెడ్డి గత కొన్ని సంవత్సరాలు గా కోదాడ పరిసర ప్రాం తాల్లో భూములు కొనుగోలు చేస్తూ, వెంచర్లు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో శ్రీరంగాపురంలోని రైతుల వద్ద అప్పులు తీసుకొని తిరిగి ఇస్తూ నమ్మకం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 60 మంది రైతుల వద్ద రూ.11 కోట్లు వడ్డీకి తీసుకున్నాడు. అయితే తమకు అవసరాలు ఉన్నాయని అప్పు తిరిగి వెంటనే చెల్లించాలంటూ కొంతకాలంగా రైతులు సదరు వ్యాపారిపై ఒత్తిడి తేవడంతో జితేందర్‌రెడ్డి రెండు రోజుల క్రితం ఐపీ దాఖలు చేసిన నోటీసులను రైతులకు పంపి, కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. దీంతో అప్పు ఇచ్చిన రైతులు లబోదిబోమంటూ ఆయన ఇంటి ఎదుట ధర్నాకు దిగా రు. తమ పిల్లల చదువు కోసం, ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కష్టపడి సంపాదించిన సొమ్మును స్వాహా చేసి పరారయ్యాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జితేందర్‌రెడ్డిపై కేసులు పెట్టాలని, ఆందోళనతో ఉపయోగం లేదని బాధితులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.