సూర్యాపేట-ఖమ్మం రహదారి వెంట రామయ్య(పేరు మార్చాం) అనే వ్యక్తికి నాలుగెకరాల భూమి ఉంది. నాలుగేండ్ల క్రితం హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చి ఎకరాకు రూ.60 లక్షలు ఇస్తాం.. భూమి అమ్ముతవా అని అడిగితే.. ‘నాకేం అవసరం లేదు. అమ్మను’ అన్నాడు. ఇటీవల రామయ్యకు డబ్బు అత్యవసరం ఉండి అమ్ముకునేందుకు మార్కెట్లో పెడితే నాలుగు నెలల పాటు అలాగే ఉంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎకరం రూ.35లక్షలకు మించి వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. ఎకరం రూ.34 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒకరు రావడంతో మల్లయ్య విధిలేక అదే ధరకు రెండెకరాలను విక్రయించాడు. సాగు భూముల ధరలు ఏ స్థాయిలో పడిపోయాయో ఈ ఘటన తేటతెల్లం చేస్తున్నది.
సూర్యాపేట, మే 5 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సాగుభూముల క్రయ విక్రయాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతో ప్లాట్లు, సాగు భూములు కొనేవారు కరువయ్యారు. ప్లాట్ల విషయంలో అయితే.. అమ్మేందుకు పదుల సంఖ్యలో ఉంటుంటే కొనేటోళ్లు ఒకరిద్దరు కూడా ముందుకు రావడం లేదు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో భూముల ధరలు సిరులు కురిపించాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్దఎత్తున వెలిశాయి. ప్రజలు కూడా అదే స్థాయిలో ప్లాట్లు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త వెంచర్లు కనపడడం లేదు. ఎవరైనా ఆపద ఉండి డబ్బు కోసం ప్లాట్లు అమ్ముకుందామన్నా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చుక్కనీళ్లు రాక ఎడారిని తలపించిన భూములకు కేసీఆర్ రైతు బంధు, పుష్కలంగా నీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో రైతులు పంటలు బాగా పండించారు. దాంతో అప్పటివరకూ రూ.వేలల్లో పలికిన భూముల ధరలు లక్షలకు చేరాయి. ప్రస్తుతం కొనుగోలు చేసేవారు లేక ధరలు అమాంతం పడిపోయాయి.
అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్నింటా విఫలమవుతున్నది. సాగు నీళ్లు లేవు. కరెంటు లేదు. రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. ఇలా అన్నింటా రైతులు, ఇతర రంగాల వారు దెబ్బతిన్నారు. ప్రజా జీవనం ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి అతలాకుతం అవుతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన సంక్షేమ ఫలాలతో ప్రజల చేతిలో డబ్బులు కనపడ్డాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో పాలనా వైఫల్యం, నిర్లక్ష్యం వెరసి మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు దాపురించి ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. గతంలో నిత్యం వందకుపైగా డాక్యుమెంట్లు వచ్చిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నేడు.. ఎవరైనా వస్తే బాగుండు అని ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగించిన వేలాది మంది ఏజెంట్లకు ఉపాధి కరువైంది. ఆయా కుటుంబాలు ఆర్ధికంగా చిన్నాభిన్నమయ్యాయి.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విజన్‌తో ప్రాజెక్టులు నిర్మించి సాగు నీటిని తెస్తే రైతులకు భూములకు విలువ పెంచారు. మరోవైపు కనీవిని ఎరుగని రీతిన అభివృద్ధితో అన్ని ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో గానీ, మండల కేంద్రాల్లో గానీ ఒక్కటంటే ఒక్క వెంచర్ కూడా కొత్తగా రాలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గతంలో కుడకుడ రోడ్డు, గాంధీనగర్, దురాజ్‌పల్లి ప్రాంతాల్లో గజం రూ.15 వేల నుంచి 20 వేల వరకు పలికిన చోట కూడా నేడు విక్రయాలు లేవు. డబ్బులు అత్యవసరం ఉన్న వాళ్లు గజం రూ.10వేలకు అమ్ముకునేందుకు కొనేవాళ్లు లేరు. సూర్యాపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అప్పట్లో రోజుకు 70 నుంచి 100 రిజిస్ట్రేషన్లు కాగా, నేడు ఒకటీ రెండు కూడా రావడం లేదు.
గత ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లుగా ఉన్న భూముల ధరలు ఎకరాకు ఆయా ప్రాంతాలను బట్టి రూ.30 వేల నుంచి 70 వేల వరకు పలికేవి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు తీసుకురావడంతో బీడు భూములు సిరులు పండించాయి. రైతుల చేతిల్లో డబ్బు కనపడింది. జరిగిన అభివృద్ధికి అనుగణంగా భూములు ధరలు పెరిగాయి. ఎకరా రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలికాయి. కొంతమంది రైతులు తమకు ఉన్న భూమిలో ఒకటో, రెండో ఎకరాలు అమ్మి ఇల్లు నిర్మించుకోవడం, ప్లాట్లు కొనుగోలు చేయడం, పిల్లలను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించడం, కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేసి సౌకర్యవంతమైన జీవనం గడిపారు. కానీ నేడు నీళ్లు రాక పంటలు ఎండిపోతుండడంతో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు రూ.30 లక్షల నుంచి కోటి రూపాయలు పలికిన భూములు నేడు అమ్ముకుందామంటే కొనేవాళ్లు దొరకడం లేదు. ఎవరైనా కొనేందుకు వచ్చినా అడ్డికి పావుసేరు లెక్క అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యం కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నాశనమై తామంతా రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయని ఆ రంగంపై ఆధారపడిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. అమ్మేవాళ్లు వంద మంది ఉంటే కొనేవాళ్లు ఒక్కరుంటున్నారు. అమ్మేవాళ్లు నష్టానికి అమ్ముకోలేకపోతున్నారు. కొనేవాళ్లు ధర పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. ప్లాట్లు, ఇండ్లు అమ్ముడు పోవడం లేదు. గతంలో రోజుకు కనీసం ఒకటి, రెండు ప్లాట్లు అయినా అమ్ముడుపోయేవి. ప్రస్తుతం రెండు నెలలకు ఒక్క ప్లాటు కూడా అమ్మలేకపోతున్నాం. మాలాంటి ఏజెంట్ల కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు.
-గన్నోజు భరత్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, సూర్యాపేట
రియల్ ఎస్టేట్ పరిస్థితి రోజురోజుకూ పడిపోతున్నది. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి పథంలో పయనించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చి సూర్యాపేటలో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేశారు. రోజూ వందల రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ప్రస్తుతం అమ్మేవారు ఉన్నా కొనేవారు లేరు. రిజిస్ట్రేషన్లు లేక దస్తావేజు షాపులన్నీ వెలవెలబోతున్నాయి. కుటుంబాలు సాగే పరిస్థితి లేదు. దీనికితోడు ప్రభుత్వం స్లాట్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తామని చెప్తున్నది. అదే కనుక జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడుతాయి. ప్రభుత్వం పునరాలోచించి స్లాట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి.
– తంగెళ్ల వెంకట్‌రెడ్డి, డాక్యుమెంట్ రైటర్, సూర్యాపేట