కట్టంగూర్, జనవరి 30 : రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కట్టంగూర్ మండలంలో గోదాంల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాలను పరిశీలించినట్లు నల్లగొండ ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మునుకుంట్లలో 725, కల్మెరలో 263 సర్వే నంబర్లలోని స్థలాలను తాసీల్దార్ పుష్వలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మునకుంట్ల గ్రామంలో గోదాంల నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా లేఖ రాశారని తెలిపారు. మునుకుంట్లలోని 725 సర్వే నంబర్ లోని స్థలాన్ని పరిశీలించగా గోదాంల నిర్మాణానికి అనుకూలంగా లేదన్నారు. కల్మెరలో 263 సర్వే నంబర్ లో ఇప్పటికే గుర్తించిన 3 ఎకరాల స్థలం ఉందని, పక్కనే మరో రెండు ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సర్వేయర్ ను ఆదేశించారు.
గోదాంల నిర్మాణానికి స్థల గుర్తింపు పూర్తి కాగానే కలెక్టర్ కు నివేదికను సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం భూ భారతికి సంబంధించిన లాగిన్ లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తాసీల్దార్ ను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తాసీల్దార్ ఆల్బట్ ప్రాంక్లిన్, ఆర్ ఐ రామారావు, సర్వేయర్ మధు, జీపీఓలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.