నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో నయవంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (Ravindra Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ (Congress) అనేక అడ్డగోలు హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందని విమర్శించారు. శనివారం డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన నీలదీసి కోట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. పథకాల అమలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు.
రేవంత్ పాలనలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ.. నేడు రేవంత్రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారని విమర్శించారు. నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు. బడికి పోయే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వా తాతల దాకా రోడ్లు ఎక్కారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డిదేనని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మకు చీరలు, కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు, గొర్రెలు ఇచ్చారు. చెరువుల్లో చేపలు వేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చిందని వెల్లడించారు. రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం అని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన అప్పుతో ఢిల్లీకి మూటలు కట్టుడు తప్ప ఏం చేశాడని ప్రశ్నించారు. బీఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు.