నల్లగొండ రూరల్, నవంబర్ 24 : ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో తెలంగాణలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందని, అందుకే ఈ నెల 29న నల్లగొండలో దీక్షా దివస్‌కు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అదివారం మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెలేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామని, దీనికి ప్రజా ప్రతినిధులలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నదని, లగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వం రైతులపై దమనకాండను మానుకోవాలని హితవు పలికారు. మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో డ్రామా నడుపుతున్నారన్నారు. సీఎం పక్కా రియల్టర్‌గా పని చేస్తున్నాడని, బీఆర్ఎస్ హయాంలో ఎంతో కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే నేడు ఆ బ్రాండ్‌ను సర్వనాశనం చేశారని తెలిపారు. 29న ఏర్పాటు చేసే దీక్షా దివస్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కల్లుగీత కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని గణేశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, యుగేంధర్‌రెడ్డి, బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య, శ్రీనివాస్, తవిట కృష్ణ, బొజ్జ వెంకన్న, మాజీ సర్పంచ్ గుండెబోయిన జంగయ్య, గంజి రాజేందర్, చంద్ర శేఖర్‌రెడ్డి, వివేక్ పాల్గొన్నారు.