చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 3: బీఆర్ఎస్తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం కందుకూరు గ్రామంలోని వేర్వేరు పార్టీల నుంచి 50 మంది దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతోపాటు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు పార్టీశ్రేణులు సైనికుల్లా కృషి చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు, నాయకులు ఉప్పుగంటి ప్రశాంత్రావు, రాఘవాచారి, పెద్దయ్య, ప్రవీణ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.