అర్వపల్లి, డిసెంబర్ 18 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టినట్లు అర్వపల్లి మండలం రామన్నగూడెం నూతన సర్పంచ్ కర్నాటి వెంకన్న తెలిపారు. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన వెంకన్న స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా పడావుపడి నిరుపయోగంగా ఉన్న చెలిమ బావిని శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు.
వందేళ్లుగా గ్రామంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించే చెలిమి బావి నిర్లక్ష్యం వల్ల మురుగు నీటితో నిండి దుర్వాసన వస్తుండడంతో బావిని వదేశారు. దీంతో తాగునీటి సమస్య తీవ్రమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండంతో శుభ్రం చేసి వినియోగంలోకి తెచ్చారు. అలాగే గ్రామంలో బోరు బావికి మోటారు కాలిపోగా నూతన మోటారు బిగించి వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు తవిటి సైదులు, శారద నాగరాజు, ముఢావత్ తనేశ్ స్రవంతి, మర్రి లతీఫ్, గంట రవి, మాగి మీనాక్షి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.