యాదాద్రి భువనగిరి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందని ద్రాక్షగానే మారింది. అగో ఇస్తం.. ఇగో ఇస్తం.. అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడంలేదు. గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న యువత ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రణాళికల రూపకల్పన పేరుతో కాలయాపన చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ప్రభుత్వం అమలు చేయడంలేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. రేషన్ కార్డు కలిగిన బడుగు బలహీన వర్గాల యువతతో పాటు ఈబీసీ, మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో రూ. 50వేల యూనిట్‌తోపాటు చిన్ననీటిపారుదల యూనిట్లకు అంటే వ్యవసాయ బోర్లు, బావుల తవ్వకం లాంటి వాటికి రూ. లక్ష వరకు వంద శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. రూ. లక్ష నుంచి 4లక్షల లోపు వరకు వరకు 90శాతం నుంచి 70 శాతం వరకు సబ్సిడీతో బ్యాంక్ లింకేజీతో లోన్ ఇవ్వనుంది.
దీని కింద ప్రతి నియోజకవర్గానికి 4200 మందికి ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు 9188 యూనిట్లను మంజూరు చేశారు. అర్హుల నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్ నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఉమ్మడి నల్లగొండలో రాజీవ్ యువ వికాసం స్కీంకు వివిధ వర్గాల నుంచి 1,78,060 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో నల్లగొండ నుంచి 79,052, యాదాద్రి భువనగిరి నుంచి 38,904, సూర్యాపేట నుంచి 60,104 దరఖాస్తులు వచ్చాయి.
యాదాద్రి జిల్లాలో మొత్తంగా చూస్తే ఒక్కో యూనిట్‌కు ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. రూ. 50వేలు, రూ. లక్ష యూనిట్ల కింద అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. రూ. 2లక్షల నుంచి 4లక్షల యూనిట్లకే ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. అధికారులు, బ్యాంక్‌లు పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.
ప్రణాళికల పేరుతో కాలయాపన..
ఈ పథకాన్ని జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోవత్సవం సందర్భంగా అమలు చేస్తామని సర్కారు గొప్పగా ప్రచారం చేసుకున్నది. సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. వివిధ కారణాలు చెబుతూ పథకాన్ని వాయిదా వేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది యువతలో అయోమయం, ఆందోళన నెలకొంది. కేబినెట్ సమావేశంలో అమలు విషయమై చర్చ జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తామని, ప్రణాళికతో అమలు చేస్తామని స్వయంగా సీఎం ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు.
‘స్థానిక’ ఎన్నికలకు భయపడేనా..?
పథకం ప్రారంభానికి అన్ని సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. రుణాల కోసం వివిధ వర్గాల నుంచి లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ యూనిట్లు మంజూరయ్యాయి. రానున్న రోజుల్లో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కొంత మందికే రుణాలు ఇస్తే.. మిగతా వారి నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వరుస ఎన్నికల్లో రాజీవ్ యువ వికాసం పథకం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ మద్దతుదారులు ఓటమి పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సర్కారు పథకాన్ని వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల తర్వాత రుణాలు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నది. అప్పటి దాకా స్కీంను ముట్టుకోకుండా పెండింగ్‌లో పెట్టింది.