మర్రిగూడ, డిసెంబర్ 3: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సొంతంగా రూపొందించిన మద్యం పాలసీ రూల్స్‌కు బ్రేకులు పడ్డాయి. ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తున్నారు.
తాగుడుకు బానిసలై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను వేయించి బెల్టు షాపులను కట్టడి చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. వైన్స్‌ల ఏర్పాటుకు మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకునే సమయంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు రూల్స్‌ను వివరిస్తూ తనదైన శైలిలో ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రాలు ఇప్పించారు.
నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు లైసెన్స్ పొందిన చౌటుప్పల్ మినహా మర్రిగూడ, నాంపల్లి, చండూరు, మునుగోడు, గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల వ్యాపారులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నవంబర్ రెండో వారంలో సమావేశం నిర్వహించారు. ఊరికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేయాలని, అవి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకే తెరిచి ఉంచాలని చెప్పారు. సిట్టింగ్‌లకు కూడా అదే సమయాన్ని పాటించాలన్నారు. బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేయొద్దని స్పస్టం చేశారు. రూల్స్ ప్రకారం నడిపించకపోతే యజమానులు దుకాణాలు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వ్యాపారులు స్పందిస్తూ ఇలా అయితే తీవ్రంగా నష్టపోతామని, కనీసం మద్యాహ్నం 1 గంట నుంచైనా దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ఎమ్మెల్యేను కోరారు.
కొత్తగా లైసెన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు ఈనెల 1న దుకాణాలను ప్రారంభించా రు. రాజగోపాల్ రెడ్డి పాలసీకి భిన్నంగా అధికారులు, వ్యాపారులు ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తున్నారు. వైన్స్లతోపాటు సిట్టింగులను కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. మునుగోడు మినహా మిగతా మండలాల్లో ఇదే సమయపాలన పాటిస్తున్నారు. బెల్టు షాపులకు కూడా మద్యాన్ని తరలిస్తూ ఎమ్మెల్యే సూచించిన నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. మర్రిగూడ, చండూరు, నాంపల్లి మండలాల్లో జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మర్రిగూడకు చెందిన పలువురు గ్రామస్తులు వైన్స్‌లను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. చండూరులో వైన్స్ ప్రారంభం రోజే దుకాణాన్ని ఊరిమధ్యలో నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ మద్యం తెచ్చిన డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రూల్స్‌కు తలఊపిన మద్యం వ్యాపారులపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. ఈ విషయమై నాంపల్లి ఎక్సైజ్ సీఐని వివరణ కోరగా ఎమ్మెల్యే నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.