యాదాద్రి భువనగిరి, మే 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలం సాగు ఆశాజనకంగా షురూ అయ్యింది. పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. వరినార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఇప్పటికే వలిగొండ, పోచంపల్లి, రామన్నపేట, రాజాపేట, బీబీనగర్ మం డలాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,40,500 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 2,95,000 ఎకరాల్లో వరి వేయనున్నట్లు భావిస్తున్నది. ఆ తర్వాత 1,15,000 ఎకరాల్లో పత్తి వేసి అవకాశం ఉందని లెక్కలు వేసింది. కాగా గతేడాది వానకాలం లో 4,25,144 ఎకరాల్లో పం టలు వేశారు. ఇక ఈ సీజన్లో అన్ని నెలలు కలిపి 75, 039 మెట్రిక్ టన్నుల ఎరువులు, మందులు అవసరపడతాయ ని, మేలో జిల్లా కు 6,998 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉన్నది.