నల్లగొండ ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : 2019 లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించారు. గతంతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగా ఓట్లు సాధించారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి 5,59,905 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందారు. భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 2,22,170 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండు స్థానాల్లో భారీ విజయాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. అసెంబ్లీ స్థానాల వారీగా చూసినా అన్ని చోట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. అభ్యర్థుల విజయానంతరం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
నల్లగొండలో రికార్డు విజయం
నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ రికార్డు విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కందూరు రఘువీర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం సాధించారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 12,96,324 ఓట్లు పోలవగా.. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 7,84,337 ఓట్లు లభించాయి. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,432 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి 2,18,417 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం 24 రౌండ్లలో ఈవీఎం ఫలితాలు, మరో రౌండ్లో పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలను వెల్లడించారు. అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు దూసుకెళ్లారు. దీంతో రఘువీర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతటి మెజార్టీతో ఘన విజయం సాధించి కొత్త రికార్డు సృష్టించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి 50వేలకు తగ్గకుండా మెజార్టీ లభించింది. అత్యధికంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో 1,05,419 ఓట్ల మెజార్టీ రాగా.. అత్యల్పంగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గమైన నల్లగొండలో 53,179 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం పోలైన ఓట్లలో రఘువీర్‌రెడ్డి 60.50శాతం ఓట్లు సాధించగా.. బీజేపీకి 17.31 శాతం, బీఆర్ఎస్కు 16.85 శాతం ఓట్లు వచ్చాయి. విజయానంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్, జయవీర్‌రెడ్డి తదితరుల సమక్షంలో రఘువీర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారి హరిచందన నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నాయి.
ఇద్దరూ తొలిసారే..
నల్లగొండలో గెలిచిన కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరిలో విజయం సాధించిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. వీరిద్దరికీ టికెట్లు ఇప్పించడంలో రేవంత్‌రెడ్డిది కీలక పాత్ర కాగా.. గెలుపు కోసం ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా పనిచేశారు. నల్లగొండలో రఘువీర్‌రెడ్డి కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించి హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే సుమారు రెండు లక్షల మెజార్టీని సాధించి పెట్టారు. మిగతా చోట్ల కూడా భారీ మెజార్టీలు దక్కాయి. దాంతో ఎవరూ ఊహించని విధంగా పోటీ చేసిన తొలిసారే ఇటు రఘువీర్‌రెడ్డి, అటు కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు.
భువనగిరిలో 2,22,170 ఓట్ల మెజార్టీ..
భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 2,22,170 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం 14,01,721 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 6,29,143 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నర్సయ్యగౌడ్ 4,06,973 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ 2,56,187 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎమ్డీ జహంగీర్‌కు 28,730 ఓట్లు లభించాయి. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఈ నలుగురికి మినహా మిగతా వారికి నామమాత్రం ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 44.89 శాతం, బీజేపీకి 29.04, బీఆర్ఎస్కు 18.28, సీపీఎంకు 2.05శాతం ఓట్లు దక్కాయి. గెలుపు అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.