బీబీనగర్, మార్చి 11 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన నాయకులు మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై అందరి సమక్షంలో ఈ తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల నుండి మద్యం అమ్మితే అమ్మిన వారికి రూ.25 వేల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. మద్యం అమ్మడం చూసి పట్టుకున్నా, సమాచారం ఇచ్చినా వారికి రూ.5 వేలు బహుమతిగా అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ మద్యం విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో లభిస్తుండడంతో స్థానిక యువకులు మద్యానికి బానిసలవుతున్నట్లు తెలిపారు. పలువురు రోగాలు, ప్రమాదాల భారిన పడుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అందరి ఆకాంక్ష మేరకు బెల్డ్ షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొటోళ్ల శ్యామ్ గౌడ్, బండారు ఆగమయ్య గౌడ్, బుయ్య కిశోర్ గౌడ్, జక్కి నగేశ్ పాల్గొన్నారు.