తిరుమలగిరి నవంబర్ 13: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసింది. తిరుమలగిరి మం డలంలోని 16 గ్రామాలకు 195 ఇండ్లు, తిరుమలగిరి మున్సిపాలిటీకి 177 ఇండ్లు మంజూరయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత గ్రామమైన తాటిపాములతోపాటు తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం నేటికీ మొదలు కాలేదు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత గ్రామమైన తాటిపాములలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనలు ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి విడతగా గ్రామానికి 40 ఇండ్లు మంజూరయ్యాయి. గతంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చినప్పుడు గ్రామానికి 100 ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారుల జాబితాను కూడా ప్రకటించారు. అయితే కొత్తగా ప్రకటించిన ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో గ్రామంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. దీనితో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
తిరుమలగిరి మున్సిపాలిటి పరిధిలో ఉన్న 15 వార్డుల్లో 177 ఇండ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకుల మధ్య తేడాలు రావటంతో జాబితా ఆలస్యమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
తాటిపామలలో వెంటనే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. మండలంలోని అన్ని గ్రామా ల్లో ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా మా గ్రామంలో మాత్రమే నిర్మాణ పనులు ప్రారం భం కాలేదు. ఇండ్లు లేని పేదలు ఇండ్లు నిర్మించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. గత రెండు, మూడు నెలలుగా ఇండ్ల ప్రొసీడింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. తిరుమలగిరి మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 177 ఇళ్ల నిర్మాణాలకు ఆమో దం లభించినా ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వకపోవటం శోచనీయం. అధికారులు అ నుమతులు ఇచ్చి ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.