చండూరు, జూన్ 12 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు పుష్పాలు అందజేసి పాఠశాలల్లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
బంగారిగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్ రామలింగయ్య మాట్లాడుతూ.. బంగారుగడ్డ ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం ఉత్తమమైన ఫలితాలు సాధిస్తూ వస్తుందన్నారు. గ్రామంలోని విద్యార్థులందరూ ప్రైవేటు పాఠశాలలకు, దూర ప్రాంత పాఠశాలలకు వెళ్లకుండా గ్రామంలోని ఉన్నత పాఠశాలలోనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాదగోని వెంకటేశ్వర్లు, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.