నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ) /రామగిరి, డిసెంబర్31: ఆగకుండా సాగిపోయే కాల గమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా ఇంకో ఏడాది ప్రవేశించింది. ఆశాజీవిగా ఉన్న మనిషి మంచి రోజులను కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాడు. కాలమనే పుస్తకంలో నేటి నుంచి మరో కొత్త పేజీ తెరుచుకోగా.. మరిచిపోలేని అనుభూతులు, అనుభవాలు, చేదు జ్ఞాపకాలు తలుచుకుంటూ, గతస్మృతులను మరోసారి నెమరు వేసుకుంటూ యావత్ జిల్లా ప్రజానీకం 2024కి వీడ్కోలు పలికింది.
సరికొత్త ఆశలు, కొంగొత్త ఆశయాలతో మంచి రోజులను ఆశిస్తూ… ఉత్సాహంగా నూతన ఏడాది 2025కి స్వాగతం పలికింది. పాతకు వీడ్కోలు, కొత్తకు స్వాగతం నేపథ్యంలో జిల్లా అంతటా సంబురాలు జరిగా యి. ముఖ్యం గా మద్యం, మాంసం దుకాణాల వద్ద రష్ కొనసాగింది. జిల్లా కేంద్రం నల్లగొండ సహా పట్టణాల్లో బేకరీలు, స్వీట్ షాపుల వద్ద కేకులు అమ్మకాలు కొనసాగాయి.
కావలసిన వాళ్లు, తెలిసిన వాళ్లు, కలిసిన వాళ్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ సెల్ ఫోన్లు మార్మోగగా.. బీప్ బీప్ అంటూ ఎసెమ్మెస్‌లు డంప్ అయ్యాయి. ఇక నూతన సంవత్సరం రోజున బుధవారం కూడా వేడుకలు కొనసాగింపుగా ప్రజలు ప్లాన్ చేసుకున్నారు. ఎక్కవ మంది తమ ఇష్టదైవాలను కొలిచేందుకు ఆలయాల బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త ఏడాదిలో కొత్త కోరికలు నెరవేరాలా దేవుళ్లను కొలవాలని భావిస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా ఏదైనా పర్యటన ప్రాంతాలకు వెళ్లేందుకు మరికొందరు ప్రణాళికలు రూపొందించుకున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆలోచనలతో పట్టుదలతో కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్లోకి అడుగులు పెట్టాలని.. ప్రజలంతా తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
న్యూయర్ అనగానే యువత జోష్‌లో రోడ్లమీదకు రావడం సర్వసాధారణం. రయ్య్ మంటూ బైక్‌లపై దూసుకుపోతూ సందడి చేస్తుంటారు. మద్యం ప్రియులు సైతం తాగి రోడ్లపైకి వచ్చేస్తుంటారు. దీంతో ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. అందుకే కొత్త సంవత్సరం వేడుకలు విషాదాలకు కారణం కారాదంటూ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వారం రోజుల ముందు నుంచే పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నది. న్యూఇయర్ వేడుకల పేరుతో ఇష్టమొచ్చినట్లుగా రోడ్లపై తిరిగితే కేసులు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. గత వారం పది రోజులుగా డ్రంక్న్ డ్రైవ్ కేసుల సంఖ్యను పెంచారు. దీంతో పోలీసుల హెచ్చరికల ప్రభావం కూడా న్యూఇయర్ వేడుకలపై కనిపించింది. అపార్ట్మెంట్లు, ఇండ్లల్లోనే ఎక్కువ మంది వేడుకలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇక గ్రామాల్లో సైతం పోలీసుల నిఘా కొనసాగింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా.. చిన్నా, పెద్ద అన్న బేధం ఎరుగకుండా.. స్వీయ నియంత్రణ నడుమ జిల్లా నూతన ఏడాదిలోకి ప్రవేశించిందని చెప్పవచ్చు.