చిట్యాల, జులై 03 : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూడాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలపై అధికారులకు అవగాహన ఉండాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు ఎరువుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. చిట్యాల మండలానికి 394 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు, వాటికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిషన్ భగీరథ కోసం రోడ్లు ధ్వంసం చేశారు కానీ అన్ని గ్రామాలకు సరిగ్గా నీళ్లు అందడం లేదని సంబంధిత అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే సాగునీటి కోసం పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఉదయ సముద్రం కాల్వల ద్వారా నింపే చెరువులు కాకుండా మిగిలిన చెరువులను కూడా నింపడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులను చైతన్య వంతం చేసి సహజ ఎరువులు వాడేలా అవగాహన కల్పించాలని, చిరు ధాన్యాలను పండించటానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, ఎంపీడీఓ ఎస్పీ జయలక్ష్మి, తాసీల్దార్ కృష్ణ, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్, వెల్మినేడు పీఏసీఎస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.