నల్గొండ ప్రతినిధి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం నిర్బంధకాండను సాగిస్తున్నది. వివిధ వర్గాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, డిమాండ్ల సాధన కోసం పోరాడడం సహజం. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా, నిలదీతలు నేరమన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఎక్కడ ఎవరు సమస్యలపై గొంతెత్తినా, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినా సహించలేక పోతున్నది.
ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, తమ సమస్యల పరిష్కారానికి ఇదే తమకు సమయమని భావించి ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వివిధ వర్గాల ప్రజలు చలో అసెంబ్లీకి సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ద్వారా ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగిస్తున్నది. తెల్లవారుజాము నుంచే ఆయా వర్గాల నాయకులను ఇండ్ల వద్దే అదుపులోకి తీసుకుంటున్నారు.
వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం వరకు స్టేషన్లలోనే ఉంచుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజునే మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులను చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. దఫదఫాలుగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా ప్రతిసారీ పోలీసులు నిర్బంధకాండ సాగిస్తున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరిగిందంటూ వివిధ వర్గాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
విద్యా రంగానికి సరైన నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపునివ్వగా ఆ విద్యార్థి సంఘం నాయకులను శుక్ర, శనివారాల్లో ఎక్కడిడక్కడ అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ హమాలీలు, సెక్యూరిటీ గార్దుల వంటి అసంఘటిత కార్మికులు తమకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి చలో ఇందిరా పార్కు ధర్నాకు సిద్ధమవగా, శుక్రవారం వారినీ అన్ని చోట్లా నిర్బంధించారు.
సమస్యల పరిస్కారం కోసం చలో అసంబ్లీకి సిద్ధమైన మత్స్యకార్మికులపైనా అరెస్టుల పర్వం సాగింది. విద్యారంగ సమస్యల పరిస్కారం కోసం బీఆర్ఎస్వీ శనివారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, పెద్దవూర, త్రిపురారం, నకిరేకల్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం, చివ్వెంల, పెనపహాడ్, సంస్థాన్‌నారాయణపురం, రాజాపేట, ఆలేరు, తుర్కపల్లి తదితర మండలాల్లో ఎక్కడికక్కడ ఆ సంఘం నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు.
కాగా ప్రభుత్వ నిర్బంధకాండపై కార్మిక, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ నేతలు ఇలాంటి అరెస్టులను ఖండిస్తూ, తాము అధికారంలోకి వస్తే ప్రజా పాలన అందిస్తామని గొప్పలు చెప్పి.. కొద్దిరోజుల్లోనే ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుండడాన్ని తప్పు పడుతున్నారు. ప్రజా పాలన అంటూనే ప్రజల గొంతు నొక్కే చర్యలు మానుకోవాలంటూ హితువు పలుకుతున్నారు.