నల్లగొండ ప్రతినిధి, జనవరి23(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభల్లో మూడో రోజూ జనాగ్రహం పెల్లుబిక్కింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాలపై జన జగడం గురువారమూ కొనసాగింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా… జనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు జాబితాలు చదువుతుండగా ఎక్కడికక్కడ నిలదీశారు. తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని, అర్హులకు చోటేదని విరుచుకుపడ్డారు. అసలు ఎవరిని అడిగి జాబితాలు రూపొందించారు? అందుకు తీసుకున్న ప్రతిపాదిక ఏంటని ప్రశ్నల వర్షం కరిపించారు.
కొన్నిచోట్ల కంట నీరు పెడుతూ… దండం పెడుతూ తమ లాంటి పేదలకు పథకాలు దక్కేలా చేయాలని సామాన్యులు వేడుకున్నారు. అధికారులపై కాళ్లపై పడి తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం పంపించిన పథకాల జాబితాలతో గ్రామసభలకు వెళ్లిన అధికారులపై జనం ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే చాలాచోట్ల మౌనమే సమాధానం అవుతున్నది. కొన్నిచోట్ల అధికారులు విసుక్కుంటూ మళ్లీ దరకాస్తులు చేసుకోవాలంటూ ప్రజలు చెప్పడం కనిపించింది. కాగా, ఇంకా ఎన్ని సార్లు దరకాస్తులు చేయాలని జనం నిలదీస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి ఇప్పటికే ప్రజాపాలనలో దరకాస్తులు చేశాం.. సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు వివరాలిచ్చాం.. మధ్యలోనూ పలుమార్లు ఆశతో దరఖాస్తులు పెట్టాం.. ఇప్పటికీ మాకు పథకాలు అందకపోతే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజా పాలన గ్రామసభల్లో మూడో రోజు జనాగ్రహం పెల్లుబిక్కింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా… జనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు జాబితాలు చదువుతుండగా పేర్లు జాబితాలో ఎందుకు లేవని ఎక్కడికక్కడ నిలదీశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గుడూరు గ్రామసభకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరు కాగా జనం ఆయన్ని ఘెరావ్ చేశారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. త్రిపురారం మండలం బెజ్జకల్లో విజయ్ అనే యువకుడు తమ గ్రామంలో అనర్హులే ఎక్కువగా ఉన్నారంటూ నిరహార దీక్షకు దిగాడు. నిడమనూరు మండల శాఖపురంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హులైన తమ పేర్లు లేవని కూలీలు అధికారులను నిలదీశారు.
ముప్పారంలోనూ అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారులపై కాంగ్రెస్ పార్టీ నేతలే గరంగరం అయ్యారు. గుర్రంపోడు మండల కేంద్రంలో గ్రామసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా చాలా మంది అర్హుల పేర్లు జాబితాల్లో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పేర్లు కూడా జాబితాలో చేర్చాలని రచ్చ చేశారు. తిరుమలగిరి(సాగర్) మండలం రంగూడ్లల్లో తమ పేర్లు ఎందుకు లేవని మహిళలు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. శాలిగౌరారంలో జరిగిన గ్రామసభలో అర్హుల పేర్లు లేకపోవడంతో ఇంకా ఎన్నిసార్లు దరకాస్తులు పెట్టాలని అధికారులను నిలదీశారు.
చందంపేట మండలం ముడుదుండ్లలో అర్హులైన వారి పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ పేర్లు చేర్చే వరకు కదిలేది లేదని అధికారులను చుట్టుముట్టారు. నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో జాబితాలన్నీ తప్పులతడకగా ఉన్నాయంటూ అధికారులతో మహిళలు వాదనకు దిగారు. వేములపల్లిలో లబ్ధిదారుల జాబితాలో అనర్హులపై అధికారులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదం చేశారు. అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలని డిమాండ్ చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగలడంతో రసాభాసగా మారింది. కట్టంగూరు మండలం అయిటిపాములలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జాబితాల్లో అందరీ పేర్లు లేవని, కొద్దిమందికే ఎలా ఇస్తారని గ్రామస్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిట్యాల మండలం సుంకెనపల్లిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అసలైన పేదల పేర్లు లేవని, రేషన్‌కార్డుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా పేర్లు రాలేదని ఆందోళనకు దిగారు. ఇలా చాలా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో జాబితాల్లో పేర్లు లేని అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చేందుకు ఎగబడ్డారు. ఇక నేడు శుక్రవారంతో నాలుగో రోజు గ్రామసభలు జరుగనున్నాయి. నేటికీ గ్రామసభలు ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జాబితాల్లో ఉన్న పేర్లకు సమానంగా తిరిగి కొత్తగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే కొత్త దరఖాస్తులకు తిరిగి మోక్షం ఎప్పుడనేది వేచి చూడాల్సిందే.
సూర్యాపేటలో దరఖాస్తు ఫారాలు కరువు
సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలో సంక్షేమ పథకాలకు ఎంపిక కాని అర్హులు అధికారులను నిలదీశారు. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో రేషన్‌కార్డులు ఇండ్ల జాబితాపై తండావాసులు మండిపడ్డారు. జాబితాలో అర్హుల పేర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోదాడ మండలం కూచిపూడిలో దివ్యంగురాలు శంకర్‌శెట్టి నాగలక్ష్మి ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేసింది. మాకు సెంటు భూమిలేదు, ఇల్లు లేదు, మా ఆయన రోజు కూలీ. నాకన్నా ఎవరికి ఎక్కువ అర్హత ఉంది? అని అధికారులను నిలదీసింది.
అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. సూర్యాపేటలోని పలు వార్డుల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దరఖాస్తులకు రసీదు ఇవ్వకపోవడంతో ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని కోడూరు, కొమ్మాల, వేల్పుచర్ల, కాసర్లపహాడ్ గ్రామాల్లో ప్రజలు నుండి అధికారులకు నిలదీశారు. దాంతో మొక్కుబడిగా కార్యక్రమాలను ముగించారు. హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రజలు అధికారులపై మండిపడ్డారు.
ఈ గ్రామసభలు ఎన్నికల ముందు ఆడే కొత్త నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఎ లావణ్య సముదాయించినా వినకపోవడంతో గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు. సూర్యాపేట మండలం హనుమనాయక్తండా మహిళలు అధికారులను నిలదీశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులకు నిరసనలు ఎదురయ్యాయి. నాగారం బంగ్లా గ్రామంలో రైతు భరోసాపై అధికారులను నిలదీశారు. మద్దిరాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిదంటూ రాంపాక వెంకన్న అనే వ్యక్తి తాసీల్దార్‌ను నిలదీశాడు.
మా ఇంటికి వచ్చి చూడండి.. మాది పురిగుడిసెనో, కాదో తెలుస్తుందంటూ స్టేజీ వద్దకు వెళ్లగా.. హెడ్‌కానిస్టేబుల్ అతడిని పక్కకు నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో అనంతారం గ్రామంలో ఇందిర ఇండ్లలో అనర్హులను ఎంపిక చేశారంటూ ఆందోళనకు దిగారు. తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో నిలదీతలు కొనసాగాయి. అర్వపల్లి మండలం కాసర్లపహాడ్‌లో రావుల సోమమ్మ అనే మహిళా రైతుకు 2 ఎకరాల 16 గుంటలు ఉండగా, సేద్యంలో లేదూ.. ఇల్లు నిర్మించాలని అధికారులు రైతుభరోసాకు ఎంపిక చేయకపోవడంతో బాధితురాలు అధికారులను నిలదీసింది. తన భూమిలో మొత్తం వ్యవసాయమే చేస్తున్నాని, ఇండ్లే లేదని మండిపడింది.
యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేతల ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలో గ్రామ సభ రసాభాసగా జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు ముసాయిదా జాబితాను చదవుకుండా అడ్డం తగిలారు. సుమారు వెయ్యి మంది అర్హులు ఉంటే కేవలం 300 మందితో రేషన్ కార్డు జాబితా ఎలా ఇస్తారని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఇదే మండలంలోని కొండమడుగు గ్రామంలో అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. మోటకొండూరు మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డగూడూరులో గ్రామసభకు మహిళలు పెద్దఎత్తున వచ్చి అధికారులను నిలదీశారు. వలిగొండ మండలంతోపాటు వర్కట్‌పల్లిలో అర్హులను కాదని, అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ అధికారులు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు (ఎం) మండలంలోని కొరటికల్‌లో గ్రామసభను జనం అడ్డుకున్నారు. నారాయణపురం మండలం కేంద్రంలో అర్హులకు పథకాలు కేటాయించాలని ఓ వ్యక్తి అధికారి కాళ్లు పట్టుకుని బతిలాడాడు.