యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు ఊపందుకున్నది. మా భూములు మాకేనంటూ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతున్నది. నిత్యం ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తూ అభ్యంతరాలను, నిరసనలను తెలియజేస్తూ సర్కారుకు సెగ పుట్టిస్తున్నది. కోట్లు విలువ చేసే భూములు అడ్డికి పావుశేరు లెక్క గుంజుకుంటామంటే కుదరదని కుండబద్ధలు కొడుతున్నది. అలైన్మెంట్ మార్చాల్సిందేనని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు స్వరూపం ఇదీ..
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా 59.33 కి.మీ. మేర రోడ్డు నిర్మించనున్నారు. దీని పరిధిలోకి తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. 34 గ్రామాల మీదుగా రహదారి నిర్మించనున్నారు. రాయగిరి, చౌటుప్పల్ వద్ద ఇంటర్‌ఛేంజ్ జంక్షన్లు నిర్మించనున్నారు. 1927 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇక దక్షిణ భాగం పరిధిలో నారాయణపురం, నల్లగొండ జిల్లాలోని ఘట్టుప్పల్, మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తున్నది. దక్షిణ భాగంలో ఇటీవల సర్వే నంబర్లు ప్రకటించడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
వెనక్కి తగ్గని ‘భువనగిరి’ రైతులు
ట్రిపుల్ ఆర్‌లో భాగంగా భువనగిరి మండలంలోని గౌస్‌నగర్, కేసారం, యెర్రంబెల్లి, తుక్కాపూర్, పెంచకల్ పహాడ్, రాయగిరి గ్రామాల్లో భూములు పోతున్నాయి. ఇందులో ముఖ్యంగా రాయగిరి రైతులు తమ భూములను కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములు కోల్పోవాల్సి వచ్చింది. వైటీడీఏ విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి నిర్మాణ సమయంలో వారు భూములు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్తుండటంతో మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా సేకరించాలచి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.
చౌటుప్పల్‌లో ఉద్యమం..
చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఆనుకొని తూర్పు వైపున హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు కలిపే జంక్షన్‌ను ప్రతిపాదించారు. చౌటుప్పల్ వద్ద తలపెట్టిన జంక్షన్ విస్తరణ భారీగా పెరిగింది. చౌటుప్పల్‌లో కొత్తగా అలైన్మెంట్లో మార్పులు చేశారు. దీంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండుగా చీలనుంది. ఇది ఓ ప్రైవేట్ కంపెనీ కోసమే ప్రభుత్వం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండున్నర రెట్లు అధికంగా భూములు సేకరించాల్సి వస్తున్నది.
‘సంస్థాన్’కు తాకిన సెగ..
ఇటీవల వరకు భువనగిరి, చౌటుప్పల్ మండలాల్లో మాత్రమే పెద్ద ఎత్తున అలైన్మెంట్ మార్పుపై ఆందోళనలు కొనసాగాయి. ఇప్పుడు సంస్థాన్ నారాయణపురం మండలంలోనూ పోరు బాట పట్టారు. సోమవారం ఇదే మండలంలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
నిత్యం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ట్రిపుల్ ఆర్‌పై అభ్యంతర పత్రాలే అందించారు. అక్కడే పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో రోడ్లపై బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడంతో పోలీసులు రైతులను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మునుగోడు చౌటుప్పల్ రహదారిపై రైతుల రాస్తారోకో
సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్ 15: ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోతున్న రైతులు సోమవారం మండలంలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద మునుగోడు చౌటుప్పల్ రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఏండ్ల తరబడి వ్యవసాయమే అధారంగా జీవిస్తున్నామని ట్రిపుల్ ఆర్ రహదారి నిర్మాణంలో భాగంగా తమ భూములు తీసుకుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సందర్భంగా భూ బాధితులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని కోరారు.