తుంగతుర్తి, మార్చి 13 : పంట పొలాలకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు వేసిన పంటలు నష్టపోకుండా ఉండాలంటే ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలన్నారు. వారబంది విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. రైతులకు నీరందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజు, నర్సింహారెడ్డి, గాజుల మహేందర్, సత్యనారాయణ, ఉప్పుల లింగయ్య, రఫీక్, యాదగిరి, సాయికృష్ణ, శ్రీనివాస్, సంక్రు నాయక్, లింగస్వామి, మహేశ్, రమేశ్ పాల్గొన్నారు.