నల్లగొండ, మార్చి 13 : అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల వరకు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించడంతో నల్లగొండలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నల్ల వస్త్రంతో నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన…దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినదించడంతో పాటు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోగా బీఆర్ఎస్, పోలీసుల మధ్య తోపులాట జరగ్గా కంచర్ల వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వాటిని అమలు చేయాలని.. ఎండుతున్న పంటలను రక్షించి సాగునీరు అందివ్వాలని నిలదీసిన జగదీశ్ రెడ్డిని సభా సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను వంచిస్తూ వాటిని అమలు చేయడం లేదని అడిగిన వారిపై నిరంకుశంగా అసెంబ్లీ నుండి సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాతోనే అసెంబ్లీని గంటల తరబడి వాయిదా వేసిన స్పీకర్ సస్పెన్షన్ కుట్ర చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, భువనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, తోటి శ్రీనివాస్, యాదయ్య పాల్గొన్నారు.
Protest in Nalgonda : జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ పై నల్లగొండలో నిరసన