చౌటుప్పల్, జనవరి 9 : రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గురువారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. చౌటుప్పల్, వలిగొండ మండల్లాలోని వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి ధర్నా చేశారు. పోలీసులు భారీగా మోహరించి, రైతులు కార్యాలయం లోపలికి వెళ్తుండగా అడ్డుకున్నారు. కాగా, తాము ఎప్పుడు వచ్చినా ఆర్డీఓ వీ.శేఖర్‌రెడ్డి కార్యాలయం ఉండడం లేదని రైతులు మండిపడ్డారు. కావాలనే ఆఫీసుకు రావడం లేదని ఆరోపించారు. ‘మా భూములు మాకు కావాలి. కన్నతల్లి ముద్దురా.. ట్రిపుల్ ఆర్ వద్దురా. ప్రాణం పోయినా సరే భూములు ఇవ్వం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నో రోజులుగా తాము నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం మండిపడ్డారు. అటవీ భూములు పోతే పర్యావరణ పరిరక్షణ కోసమని రెండింతలు భూమి ఇచ్చే ప్రభుత్వం రైతులను పట్టించుకోదా అని ప్రశ్నించారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేయడం సరికాదన్నారు. ఆర్డీఓ శాఖాపరమైన పని మీద కలెక్టరేట్‌కు వెళ్లారని ఉద్యోగులు చెప్పడంతో డీఈఓ శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం అక్కడి నుంచి 65వ జాతీయ రహదారిపైకి చేరుకుని కొద్దిసేపు రాస్తారోకో చేశారు. పోలీసులు రాస్తారోకోను కూడా అడ్డుకోగా, వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో భూ నిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, దబ్బేటి రాములుగౌడ్, దశరథగౌడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక లింగంగౌడ్, చింతల ప్రభాకర్‌రెడ్డి, సందగళ్ల మల్లేశంగౌడ్, జాల వెంకటేశం యాదవ్, జాల జంగయ్యయాదవ్, గుండెబోయిన వేణుయాదవ్, వల్లూరి బోగయ్య, ఎసిరెడ్డి దామోదర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.