నల్లగొండ రూరల్, డిసెంబర్ 9 : ప్రాణాలు ఫణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహిరిస్తూ నాశనం చేస్తున్నదని నల్లగొండ, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్టించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద సోమవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో భూపాల్‌రెడ్డి, చిరుమర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంస్కృతి విధ్వంసం జరుగుతుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మారుస్తున్నారో కాంగ్రెస్ నాయకులకే స్పష్టత లేదని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన సాంస్కృతిక మార్పును కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఇంచెత్తు విమర్శ చేయకుండా ఇప్పుడు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చడం కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడంలో భాగమేనని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన వారే కదా అని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ గీతాన్ని సరైన క్రమంలో లేకుండా మార్చిన విధానాన్ని ప్రజలు తిరస్కరించుకుంటున్న విషయాన్ని యాది మరువొద్దన్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతీసంప్రదాయాలు తెలువని మూర్ఖులు కాంగ్రెస్ పాలకులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున సాగర తీరాన అతిపెద్ద అమరవీరుల స్కృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే అని గుర్తు చేశారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నిరంతరం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకునే ఆలోచనలను కాంగ్రెస్ పాలకులు మానుకోవాలన్నారు. విగ్రహాల రూపును మార్చినంత మాత్రాన కేసీఆర్ నుంచి తెలంగాణను వేరు చేయలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ మంజూరు చేసిన నిర్మించిన మెడికల్ కళాశాలను కాంగ్రెస్ పాలకులు ప్రారంభించి తామే నిర్మించినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏడాది కాలంలో ఒక్క పని అదనంగా మంజూరు చేయించలేదని, సీఎం తో నల్లగొండ అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటింప జేయలేక పోయారని విమర్శించారు. నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, కల్లుగీత రాష్ట్ర కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమాన్యు శ్రీనివాస్, కౌన్సిలర్ మారగోని గణేశ్, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, సీనియర్ నాయకులు మాలె శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, నారబోయిన భిక్షం, బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, ,మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షులు అన్వర్ పాష, నాయకులు అయితగోని యాదయ్య, మెరుగు గోపి, మాతంగి అమర్, దొడ్డి రమేశ్, శంషుద్దీన్,వీరమళ్ల భాస్కర్, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, కంకణాల వెంకటరెడ్డి, సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రదరెడ్డి, కొప్పోలు విమలమ్మ, కొండ స్వరూప, కున్రెడ్డి సరోజ, కంచర్ల విజయరెడ్డి, బొట్టు మల్లికాంబ, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.