నేరేడుచర్ల, మార్చి 22 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో అసంఘటిత నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్ మాట్లాడుతూ.. భవన నిర్మాణం, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, బీడీ తదితర రంగాల కార్మికులకు సామాజిక భద్రత చట్టం అమలు చేయాలన్నారు.
శుక్రవారం ఛలో హైదరాబాద్ వెళ్తున్న కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెల్ఫేర్ బోర్డులోని నిధులను కార్మికులకే ఖర్చు చేయాలని, పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాలు ఆగమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల కష్టాలను గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల భవన నిర్మాణ సంఘం కోశాధికారి గుంజ రవీందర్, సైదా, సత్యం, రామారావు, నరేశ్, కొండలు, శివ, శ్రీను, నరసింహ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.