కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ రాజేందర్
నల్లగొండ, జూన్ 5 : పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ బి. రాజేందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీ కళాశాల నుంచి బాలభవన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని పర్యావరణ వేత్త సురేశ్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎక్కువగా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో పర్యావరణ సహాయ ఇంజినీర్ రవీందర్, పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ పర్యావరణ ఇంజినీర్ కొమ్ము ప్రసాద్, ఎన్జీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నీలగిరి: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది కార్యాలయం నుంచి ఎన్జీ కళాశాల వరకు ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. మెప్మా టీఎంసీ శ్రీనివాస్, సీఓలు అనిల్‌కుమార్, జ్యోతి, నర్సింహ, రాజా పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి : డీఈఓ
రామగిరి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని డీఈఓ బి.భిక్షపతి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నిర్వహిస్తున్న టెన్త్ స్పాట్ క్యాంపు ఆవరణలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.