తుంగతుర్తి, ఏప్రిల్ 08 : తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దుగ్యాల రవీందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఉద్యమకారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎనలేని ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రాణాలర్పించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, వాటిని వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు షేక్.జానీ, బానోతు భగవాన్, మల్లయ్య పాల్గొన్నారు.