గరిడేపల్లి, జూన్ 23 : ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణామాఫీ చేయాలన్నారు. రైతులందరికి రైతు భరోసా నిధులు అందించాలన్నారు. నకిలీ విత్తనాలను నిర్మూలించి, ఎరువులు, విత్తనాల ధరలను తగ్గించాలన్నారు. లేకపోతే కర్షక లోకం స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర ఆదాయం, అప్పులపై అవగాహన లేకుండా ఎలా వాగ్దానాలు చేశారని విమర్శించారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, కుందూరు వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, నర్సింహారావు, తిరపతయ్య, పంగ సైదులు, ఈశ్వరాచారి, షేక్ నబీసాహెబ్, పీర్ సాహెబ్, వెంకటేశ్వర్లు, అచ్చయ్య, వెంకన్న పాల్గొన్నారు.