చందంపేట (దేవరకొండ), జూలై 22 : గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు రమావత్ రమేశ్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అన్ని వసతులు అందుబాటులో తీసుకొచ్చినట్లు చెప్పారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటికి నోట్ బుక్స్ సగం మంది విద్యార్థులకే అందాయని, కొన్ని పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. అంతకుముందు డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ఎస్వీ నాయకులు బాబా, లక్ష్మణ్, లాలయ్య, రాములు, గణేశ్, రవి ఉన్నారు.