– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
నీలగిరి, మార్చి 23 : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు మార్చి నెల నుండి ఒంటిపూట బడులు నిర్వహణతో పాటు మే నెలలో టీచర్స్, హెల్పర్లకు ఇద్దరికి ఒకేసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.18,000/-ల వేతనంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా నేటికి అమలు చేయలేదని విమర్శించారు.
24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మిని టీచర్స్ ఏరియర్స్, పీఆర్సీ ఏరియర్స్ తదితర డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వాటిని వేంటనే విడుదల చేయాలన్నారు. కేంద్రం తెచ్చిన ఎస్ఐపి- 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి 2028 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు. జీఓ నెం.14ను సవరించాలన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎస్ఆర్ఎస్ను రద్దు చేసి ఒకే ఆన్లైన్ యాప్ తో 5జి నెట్వర్క్ కూడిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలన్నారు.
ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీలు పిల్లలకు రూ.5/-లు, గర్భిణీ/ బాలింతలకు రూ.10/-లకు పెంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు డబుల్ సిలిండర్ ఇవ్వాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిచెట్టి నాగమణి, జిల్లా కార్యదర్శి బందు పార్వతి, జిల్లా వర్కింగ్ సెక్రటరీ ఆవుట రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.విజయలక్ష్మి, అంబటి మణెమ్మ, ఫాతిమా, ఇంద్రగంటి సైదమ్మ, పల్లా సరిత, బొబ్బలి శ్రీలక్ష్మీ, మణిరూకు, పరిపూర్ణమ్మ, యాదమ్మ, డి కళ్యాణి, ఎల్లమ్మ పాల్గొన్నారు.