నీలగిరి, డిసెంబర్ 03 : ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్‌కు మొదటి అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకుల గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు పరిశీలించారు. బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు. స్కూల్ బిల్డింగ్‌ను రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. బాలికల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో మాట్లాడుతూ వారి పేర్లు, ఇష్టమైన విషయాలను అడిగారు. బాలికలతో మాట్లాడి వారికి నచ్చిన సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టి వారికి చాక్లెట్స్ పంపిణీ చేశారు.
విద్యార్థులకు చదువు, ఆటలు, ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ అంశాలను తెలియజేశారు. బాగా చదివి తల్లిదండ్రులు, టీచర్లకు మంచి పేరు తేవాలని చెప్పారు. ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగని, బాలికలకు ప్రేమ, శ్రద్ధతో నాణ్యమైన విద్య అందించాలన్నారు. పిల్లల్లో పఠన, లేఖన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన చిన్నపాటి మరమ్మతులను, సదుపాయలపై తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్ఎంను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓ రవికుమార్, ప్రిన్సిపాల్ భారతి ఉన్నారు.