– డీడీఎన్ అర్చకులకు రూ.35 వేల వేతనం ఇచ్చి సమస్యలు పరిష్కారించాలి
– దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ
– హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ గురు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్
రామగిరి, జనవరి 02 : డీడీఎన్ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నల్లగొండలో శుక్రవారం పెద్ద ఎత్తున అర్చకులతో అర్చక చైతన్య యాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్డీఓ భవనం నుంచి ఆర్పీ రోడ్డు, గడియారం సెంటర్, రామగిరి మీదుగా పానగల్ రోడ్డులోని ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వరకు చైతన్య యాత్ర ర్యాలీ కొనసాగింది. దీనిలో భాగంగా దూప, దీప నైవేద్య అర్చకులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు, ఐడీకార్డులు ఇవ్వాలని, పేద అర్చకులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అర్హులైన అందరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, అర్చకులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, అర్చక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని ప్లకార్డులను చేబూని నినాదాలు చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేసి తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.

Ramagiri : నల్లగొండలో కదం తొక్కిన దూప, దీప నైవేద్య అర్చకులు
అనంతరం టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన సమావేశంలో దౌల్తాబాద్ వాసుదేవ శర్మ మాట్లాడుతూ.. దూపదీప నైవేద్య అర్చకులు చాలిచాలని వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా కనీసం వైద్య ఖర్చులు కూడా లేకుండా దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.35 వేలకు పెంచాలని, జిల్లా కేంద్రంలోని పానగల్ లో ప్రభుత్వం కేటాయించిన 25 గుంటల స్థలంలో అర్చక భవనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురు రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైరన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దూప దీప నైవేద్య అర్చకుల సమస్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు. డీడీఎన్ జిల్లా అధ్యక్షుడు పగిడిమర్రి ప్రసాద్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామాలయ మాజీ చైర్మన్ ఆర్ఎస్ఎల్ఎన్ శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబోట్ల ఫణికుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ అమరేశ్వర్ శర్మ, చందోతి శివకుమార్, జిగురు లక్ష్మీనర్సింహ్మమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు వెంకటరామశర్మ, చిట్యాల శ్రీనివాస్ శర్మ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్చకులు పాల్గొన్నారు.

Ramagiri : నల్లగొండలో కదం తొక్కిన దూప, దీప నైవేద్య అర్చకులు