ముంబై, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. పశ్చిమాసియాల్లో నెలకొన్న యుద్ధం ఏడో రోజుకి చేరుకోవడంతో సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,097 పాయింట్లు లేదా 1.37 శాతం నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ కూడా 315.45 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టపోయి 24,450.45 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు బలహీనంగా ఉండటం, యూరోపియన్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీల నష్టాలకు ఆజ్యంపోశాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగే అవకాశం ఉండటంతో వచ్చే సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని చెప్పారు.
గురువారం భారీగా లాభపడిన సూచీలు ఆ మరుసటి రోజే అంతే వేగంతో కిందకు పడిపోయాయన్నారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.10 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ సూచీలు కిందికి జారుకున్నాయి. బ్యాంకింగ్ రంగ సూచీ 2.37 శాతం నష్టపోగా, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ 2.25 శాతం, ఆర్థిక సేవలు 2.12 శాతం, సర్వీసెస్ 1.35 శాతం చొప్పున పతనం చెందాయి. కానీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, పవర్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మదుపరులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వరుస నష్టాలతో వారి సంపద కుదేలవుతున్నది. ప్రస్తుత నెలలో మదుపరులు రూ.13 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఫిబ్రవరి 27న రూ.463.25 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రస్తుతం రూ.449.79 లక్షల కోట్లకు పరిమితమైంది. నికరంగా రూ.13.64 లక్షల కోట్లు కరిగిపోయినట్టు అయింది.