శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఏస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ ఆకస్మిక సోదాలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తూ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
కాగా, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహించినట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. కాగా, జంట సర్కిళ్లయిన శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో పలు ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండటంతో వారి నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.