‘ఈ గెలుపు ఘనత జస్ప్రీత్ బుమ్రాదే. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. తరానికొక్కడు. ఈ అవార్డు (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) అతడికే దక్కాలి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు&’ ఇంగ్లండ్‌తో సెమీస్ ముగిశాక వరుసగా రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజూ శాంసన్ చెప్పిన మాటలవి. సంజూ చెప్పింది అక్షర సత్యం! బుమ్రానే లేకుంటే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు గెలుపు ఆశలు అడియాశలే అయ్యేవి. ఈ పేసుగుర్రం సామర్థ్యం, అతడి బౌలింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయాలేమీ అవసరం లేదు. బంతినందుకున్న ప్రతిసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో జట్టును విజయపథాన నిలుపడంతో వందకు వెయ్యి శాతం కష్టపడే అత్యంత అరుదైన క్రికెటర్లలో అతడొకడని చెప్పడంలో సందేహమే లేదు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో ఓటమి ఖాయమనున్న దశలో తన రెండు ఓవర్ల స్పెల్ (అదీ డెత్ ఓవర్లలో)తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపునకు తిప్పిన అతడు.. తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు. సూపర్-8లో వెస్టిండీస్‌తో, సెమీస్‌లో ఇంగ్లండ్‌తో పోరులో బంతితో ప్రత్యర్థిని నిలువరించి గెలుస్తున్నదంటే అది అతడి చలవే!
ఈ టోర్నీకి ముందు తనదైన స్పిన్ మాయతో బెంబేలెత్తించిన ‘మిస్టరీ స్పిన్నర్’, వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ హోదాతో బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి సూపర్-8 దశ నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. అతడి మిస్టరీని ఛేదించిన ప్రత్యర్థి బ్యాటర్లు.. వరుణ్‌పై పిడుగులా విరుచుకుపడుతున్నారు. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (13)తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నా సూపర్-8లో మాత్రం అతడు అట్టర్ ప్లాఫ్ అని చెప్పకతప్పదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఏకంగా 64 రన్స్ (మొత్తంగా టోర్నీలో 28 ఓవర్లలో 248) ఇచ్చాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన అర్ష్‌దీప్ కూడా తేలిపోతున్నాడు. 2024 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి కీలక మ్యాచ్‌ల్లో సత్తాచాటిన అతడు.. ఇంగ్లండ్‌తో 4 ఓవర్లకు 51, వెస్టిండీస్‌తో 4 ఓవర్లకు 43 రన్స్ సమర్పించుకున్నాడు. అక్షర్, అర్ష్‌దీప్ సైతం పరుగులు కట్టడి చేయలేని చోట బుమ్రా తన విలువను చాటుకుంటున్నాడు.
భారత్ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఒకటి కోల్‌కతా కాగా రెండోది ముంబై. ఈ రెండు బ్యాటింగ్‌కు స్వర్గధామాలే. ఈడెన్ గార్డెన్స్‌లో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారీ స్కోరుపై కన్నేసిన విండీస్‌కు.. ఒకే ఓవర్లో హిట్టర్ హిట్‌మెయర్‌తో పాటు రోస్టన్ ఛేజ్నూ ఔట్ చేసి కట్టడిచేసింది బుమ్రానే. బ్యాటింగ్‌లో శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ కూడా భారత విజయంలో ప్రస్తావనార్హమే. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్ అయితే నభూతో నభవిష్యత్. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడే పిచ్‌లో బ్యాటర్లు తమదైన వీరవిహారంతో సింహగర్జన చేస్తున్న చోట బంతి విలువను నిలబెట్టిన ఘనుడు బుమ్రా. జాక్స్‌తో కలిసి భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బెతెల్.. ఆ జట్టును లక్ష్యానికి చేరువ చేస్తున్న వేళ బంతినందుకున్న బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. తన ట్రేడ్‌మార్క్ యార్కర్లకు తోడు ప్రత్యర్థిని బోల్తా కొట్టించే స్లో డెలివరీలతో 16వ ఓవర్లో 8, 18వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చి బ్రూక్ సేనను విజయానికి దూరం చేశాడు. మ్యాచ్ అయ్యాక ఇంగ్లండ్ హెడ్‌కోచ్ మెక్కల్లమ్ మాట్లాడుతూ.. ‘చివరి 3 ఓవర్లలో మేం 45 పరుగులు చేస్తే చాలు. ఆ సమయంలో ఒక 3 సిక్స్‌లు కొడితే పరిస్థితి మరోలా ఉండేది. ఇలాంటి పిచ్‌పై అదేమంత పెద్ద విషయమేమీ కాదు. కానీ బుమ్రా తన బౌలింగ్ నైపుణ్యంతో మాకు ఆ అవకాశమే ఇవ్వలేదు’ అని అనడం కొసమెరుపు!
6.62.. తాజా ఎడిషన్‌లో బుమ్రా ఎకానమీ. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లుగా చెప్పుకునే ఏ బౌలర్ అతడి దరిదాపుల్లో కూడా లేడు.
భారత జట్టులో బుమ్రా ఉండటం వారి అదృష్టం. ఫార్మాట్ ఏదైనా వికెట్ అవసరమైనప్పుడు అతడికి బంతినిస్తే చాలు. అతడొక జీనీ వంటివాడు. కెప్టెన్ ఆ అద్భుత దీపాన్ని రుద్దితే చాలు అందులోంచి జీనీ బయిటికొచ్చి కోరికలు తీర్చినట్టు బుమ్రా కూడా అలాంటి మాయే చేస్తాడు.