హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాబ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ను మోసగించిన కేసులో సౌభాగ్య ఇస్పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. ఆ కంపెనీకి చెందిన రూ.26.86 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. మొత్తం రూ.46.52 కోట్ల మోసం కేసులో ఈ ఆస్తులను జప్తు చేసినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
బెంగళూరులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఆంధ్రాబ్యాంక్‌ను మోసగించి భారీ నష్టాన్ని కలిగించినందుకు సౌభాగ్య ఇస్పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
స్టీల్ తయారీ యూనిట్ విస్తరణ కోసం ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంక్‌కు ఫోర్జరీ చేసిన పత్రాలు, తప్పుడు సర్టిఫికెట్లు, ఆర్థిక నివేదికలను సమర్పించి మోసపూరితంగా టర్మ్ లోన్లు, వరింగ్ క్యాపిటల్ సదుపాయాలను పొందినట్టు ఈడీ తెలిపింది. తద్వారా రూ.46.52 కోట్ల మేర నేరపూరిత ఆదాయం సమకూరినట్టు ఈడీ గుర్తించింది. ఇందులో ఆంధ్రాబ్యాంక్ ఇప్పటికే రూ.15.52 కోట్లు రికవరీ చేసింది. మిగిలిన రూ.31 కోట్ల రికవరీలో భాగంగా ఈడీ రూ.26.86 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.