అర్వపల్లి, జూన్ 13 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు సహజ కాన్పు అయ్యేలా చూడాలని, ఇందుకు వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోగ్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో కీటక జనిత వ్యాధులు, కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోద వ్యాధి, మెదడు వాపు గురించి, కలుషిత ఆహారం ద్వారా వచ్చే టైఫాయిడ్, కామెర్లు, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, కలరా గురించి అవగాహన కల్పించడం ద్వారా అరికట్టవచ్చునని తెలిపారు. గర్భిణీలకు క్రమ తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించాలని, సహజ కాన్పులు అయ్యే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ నాయక్, సీహెచ్ఓ మాలోతు బిచ్చునాయక్, సూపర్ వైజర్ లలిత, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.