Pregnant Woman | చౌటుప్పల్, జులై 9 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నమ్మదగిన సమాచారం మేరకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నిండు గర్భిణి కాన్పు కోసం స్థానిక పట్టణ కేంద్రంలోని గైనకాలజిస్ట్ వద్దకు వచ్చింది. కాగా అదే రోజు ఉదయం ప్రసవించగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత మహిళా గుండె సరిగా కొట్టుకోవడం లేదని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోనూ ప్రయివేటు దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యురాలు సూచించింది. చేసేదేమీ లేక ఆమె బంధువులు హైదరాబాద్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గర్భిణి మృతి చెందడంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆమె బిడ్డ చౌటుప్పల్ దవాఖానలోనే ఉంది.
ఈ క్రమంలో విషయం ఆస్పత్రి వైద్యులకు తెలిసింది. దీంతో మృతదేహాన్ని హాస్పిటల్ వద్ద పడేయాలని బంధువులు భావించారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆస్పత్రి నిర్వాహకులు స్థానిక అధికార పార్టీ మున్సిపాలిటీ ముఖ్య నాయకులను కలిశారు. అంతేకాకుండా ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు కూడా చెప్పడంతో వారు దవాఖానను సందర్శించి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రసవించిన మహిళలకు ముందే హార్ట్ ప్రాబ్లం ఉన్న సంగతి వైద్యులకు చెప్పలేదని.. తమ తప్పు లేదని మృతురాలి బంధువులకు చెప్పడంతో హాస్పిటల్ దగ్గరకు రాకుండా ఇంటికి వెళ్లిపోయారని నమ్మించారు. అయినప్పటికీ ఆస్పత్రి మేనేజ్మెంట్, అధికార పార్టీ నాయకులు మాట్లాడిన విషయం బయటకు వచ్చింది. దీనికి తోడు పోలీసు అధికారులు కూడా ఈ సెటిల్మెంట్కు సహకరించినట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి బంధువులకు రూ. 12 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఆస్పత్రి నిర్వాహకులతో అధికార పార్టీ నాయకులు ఒప్పందం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సెటిల్మెంట్ చేసిన నాయకులకు, పోలీసులకు కూడా అదనంగా ముట్ట చెప్పినట్టు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో సంబంధిత వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.